కర్మలు మరియు యజ్ఞముల యొక్క అంతరార్థం!

yagnam and karma
కర్మ చేయడం మనిషి స్వభావం మాత్రమే కాదు అదొక తప్పనిసరి కార్యం. నిజానికి ఎలాంటి పని చేయకుండా ఉండటం కూడా కర్మ కిందే లెక్క. ఈ కర్మలను యజ్ఞాలు అన్నాడు బ్రహ్మదేవుడు. అంటే యజ్ఞం ఎంత పవిత్రమైనదో మనిషి కర్మలు చేయడం కూడా అంతే పవిత్రమైనది. కానీ ఈ కర్మలు, యజ్ఞముల అంతార్థం ఏమిటి అనేది శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఇలా చెబుతాడు.
సహ యజ్ఞాః ప్రజాస్సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః| అనేన ప్రసవిష్యధ్వమేషవో౨స్త్విష్టకామధుక్ ||
ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారు ప్రజలను సృష్టించాడు. వెంటనే వారు చేయవలసిన కర్మలను సృష్టించాడు. వాటినే యజ్ఞములు అన్నారు. ఈ యజ్ఞముల ద్వారా అంటే కర్మల ద్వారా వృద్ధి చెందండి అని ప్రజలను ఆదేశించాడు. ఈ యజ్ఞములు మీకు అన్ని రకాల కోరికలు తీరుస్తాయి. ఈ యజ్ఞములు కామధేనువు లాంటివి అని చెప్పాడు. దీనికి సాధారణంగా అర్థం చెప్పుకోవాలంటే ఏ వ్యక్తి అయినా, పుట్టగానే వాడు చేయవలసిన కర్మ కూడా పుడుతుంది. అది మంచి కర్మ కావచ్చు చెడు కర్మ కావచ్చు.
ఆ వ్యక్తి తనలో ఉన్న గుణములను బట్టి ఆ కర్మలు చేస్తాడు. ఆ కర్మలు అతనికి కామ ధేనువు వలె తగిన ఫలితములను (మంచి గానీ, చెడు గానీ) ఇస్తాయి. చేసే కర్మలను ఒక దేవతారాధన మాదిరి, ఫలితం ఆశించకుండా చేస్తే ఆనందం, శాంతి కలుగుతుంది. అలా కాకుండా బంధనములు కలుగుతాయి. తమ ఇష్టం వచ్చినట్టు చేస్తే సుఖము, దుఃఖము కలుగుతాయి. మానవులు కర్మలు చేస్తే ఫలితాలు వస్తాయి. ఆ కర్మ ఫలితాలు బంధనములను కలిగిస్తాయి.
ఆ కర్మ బంధనములలో చిక్కుకోకుండా ఉండే సాధనములు కూడా వేదములలో శాస్త్రములలో వివరించబడ్డాయి. ఆ సాధనములే యజ్ఞములు. ఆ రోజుల్లో యజ్ఞములను వేదములలో చెప్పబడిన కర్మకాండల ననుసరించి చేసేవారు. కాని ఈ రోజుల్లో యజ్ఞము అంటే సాటి ప్రజలకు ఉపయోగపడే స్వార్ధరహితమైన కర్మ అని అర్థం చెప్పుకోవచ్చు.
ఆ కర్మ కూడా భగవంతుని పరంగా చేయాలి. పరోపకారం కొరకు చేయాలి. నిష్కామంగా చేయాలి. నేను చేస్తున్నాను అనే కర్మత్వ భావన లేకుండా చేయాలి. ఇటువంటి కర్మలు కామధేనువులు లాంటివి. కామధేనువు అంటే కోరిన కోరికలు తీర్చేది. అలాగే ఇటువంటి కర్మలు కూడా మంచి ఫలితములను ఇస్తాయి. ఇటువంటి పనులు చేయడం వలన ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అనేక దుఃఖముల నుండి విముక్తి కలుగుతుంది.
మానవునిలో నైతిక విలువలు పెంపొందెలా చేస్తుంది. ముఖ్యంగా మనసుకు శాంతి కలుగుతుంది. మనసుకు ఎప్పుడైతే శాంతి కలుగుతుందో అప్పుడు ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. క్రమంగా దేవుడి మీద మనసు లగ్నం చేసి బాహ్యప్రపంచపు మాయ నుండి బయటపడి మనిషి తనలో తాను ప్రయాణిస్తూ తనని తాను తెలుసుకోగలుగుతాడు.
ఈ రోజుల్లో ఎంత ఆస్తి, అంతస్తు, హెూదా, పదవి ఉన్నా, ప్రతి వాడికీ మనశ్శాంతి కరువవుతూ ఉంది. అనేక అక్రమాలు చేసి, అవస్థలు పడి సంపాదించిన ధనం అంతా మనశ్శాంతి కోసం ఖర్చుపెడుతున్నారు. ధర్మపరంగా నిష్కామ కర్మలు, ఫలాపేక్షలేకుండా, కర్తృత్వభావన లేకుండా చేస్తే మనశ్శాంతి దానంతట అదే లభిస్తుంది. మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో బాబాల చుట్టు తిరగ నవసరం లేదు. ఇక్కడ కర్మలు, యజ్ఞములు అంటే నిష్కామ కర్మ, నిస్వార్థ కర్మ, కర్తృత్వభావన లేని కర్మ అని అర్థం.
Content Source: https://www.facebook.com/GubbalaRamkumar
administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published.