మనలో ఉన్న దైవాన్ని తెలుసుకోవడం ఎలా?

how to find god

మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనోమూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనోమూలంలోనికి వెళ్ళినవారి “దేహమే దేవాలయమౌతుంది.” దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఆత్మయే దైవం.

కేవలం మనిషి తన కోరికలవల్ల భగవంతుని తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు, భగంతుడు ఎక్కడో లేదు నే యందు, నే లోపలే ఉన్నాడు.కానీ మనకి కానరావడం లేదు. ఎందుకనీ? మన మనస్సులో ఉన్న మాలిన్యాల వలన.!

మనలో ఉన్న దేవుడు కనబడకపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు! మొదటిది ‘ నేను’ అనే తలంపు రెండవది ‘ నాది’ అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.

మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి.. ఎలా?

దేవాలయం లో అయినా మన ఇంట్లో నయినా ప్రతిరోజు పూజ ప్రారంభానికి ముందు మనం చేసే పని ముందు రోజు నిర్మాల్యములను తీసివేయడం. ఇది చేసిన తరువాతనే మనం పూజను ప్రారంభిస్తాము. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనోమాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమును నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి. అంటే..కర్తృత్వ భావనను తొలగించుకోవాలి.

మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యమును తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరుఅడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి.

సత్ కర్మలు చేయడం, సద్గురువుల దర్శనం మరియు వారియొక్క ధర్మ మార్గ ప్రవచనాలని విని ఆచరించడం, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.

మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియా లను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే, మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం. మనలో అనేక బలహీనతలుంటాయి. అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.

హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా దానిని గురించి ఆలోచించం. ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వక ముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ఒకటి ప్రేమ, రెండుజ్ఞానం. ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published.